CM Jagan: ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించనున్న సీఎం జగన్
CM Jagan: వైద్యకళాశాలల ఏర్పాటుతో పెరగనున్న ఎంబిబిఎస్ సీట్లు
CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఒకేసారి ఐదు మెడికల్ కళాశాలలను జాతికి అంకితం చేయనున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్ర వరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. తొలి సంవత్సరం అడ్మిషన్లతో కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
విజయనగరంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలను ప్రారంభోత్సవం చేసేవిధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మెడికల్ కళాశాలతో గ్రామీణ ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువచేయాలని ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల నాటి హామీలో భాగంగా ఇప్పటిదాకా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 17 మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపుస్థాయిలో పెంచారు.