ఇవాళ ఇంద్రకీలాద్రికి సీఎం జగన్.. కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
CM Jagan: మధ్యాహ్నం 3 గంటలకు దుర్గమ్మను దర్శించుకోనున్న జగన్
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మవారిది మూలా నక్షత్రం కావడంతో.. ఇవాళ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కొండపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అక్టోబరు 15న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 24 వరకూ కొనసాగుతాయి.
అమ్మవారిది మూలా నక్షత్రం కావడం వల్ల ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేకం అని పండితులు చెబుతున్నారు. అందువల్ల సీఎం జగన్ ఇవాళ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ ఇస్తారు. ఇందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక భద్రచా చర్యలు తీసుకుంటున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఇవాళ అమ్మవారు, సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఐదో రోజు మహా చండీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులుతీరారు.