CM Jagan: ఇవాళ ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్
CM Jagan: చంద్రబాబు అరెస్ట్ తర్వాత మొదటిసారి ఢిల్లీకి జగన్
CM Jagan: ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆ మాటల యుద్ధం కొనసాగుతుండగానే ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్న ఆయన.. హస్తినలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.
హస్తిన టూర్‌లో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలోని తాజా పరిణామాలతోపాటు.. విభజన హామీలను ప్రస్తావించే అవకాశం ఉంది. వామపక్ష తీవ్రవాదంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. అలాగే.. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలవనున్నారు. ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్తుండటంతో జగన్ పర్యటన ఆసక్తిగా మారుతోంది.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కేంద్ర పెద్దలకు తెలిసే జరిగిందనే ప్రచారం ఏపీలో ఊపందుకుంది. అయితే ఈ సందర్భంలోనే జగన్ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో.. ప్రధాని, హోంశాఖ మంత్రులతో ఈ వ్యవహారంపై కూడా సీఎం జగన్ చర్చిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీ, వైసీపీ ఏకమై.. చంద్రబాబును అరెస్ట్ చేశారనే విమర్శలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారు? అనేది చూడాలి. మొత్తంగా.. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఉత్కంఠ రేపుతోంది.