Executive Capital in Visakhapatnam : ఆగస్టు 15న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు శంకుస్థాపన?
ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం దృష్టంతా పాలనా రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్) విశాఖపైనే పడింది. విశాఖలో త్వరలో ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్న నేపథ్యంలో నూతన బిల్డింగ్ లకు ఎప్పుడు శంకుస్థాపన జరుగుతుందన్న చర్చ మొదలయింది. అయితే ఆగస్టు 15న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ముహూర్తం ఖరారైందని ప్రచారం ఊపందుకుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే ఈ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజధానికి సంబంధించిన పలు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఈ పిటిషన్లు విచారణకు రాకముందే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు శంకుస్థాపన ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఒకవేళ నిర్మాణ ప్రక్రియ ఆలస్యమైతే పిటిషన్లు విచారణకు వస్తే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి స్టే విధించవచ్చని.. అందువల్ల నిర్మాణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పనులు కొనసాగిస్తుంటే అభివృద్ధికి సంబంధించిన పనులలో కోర్టులు పెద్దగా దృష్టిసారించవని ప్రభుత్వ పెద్దల నమ్మకం. మరోవైపు పాలనా వికేంద్రీకరణకు గవర్నర్ రాజముద్ర వేసిన తరువాత కోర్టుల జోక్యం ఏ విధంగానూ ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్ ఆమోదించిన బిల్లులతో ప్రజలకు ఏమైనా నష్టం వాటిళ్లిందా అనే కోణంలో మాత్రం ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక కోర్టుల్లో పిటిషన్లను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా రాజధానుల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.. మరి ఏమి జరుగుతుందో చూడాలి.