CM Jagan launches : ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు విస్తరణ. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అమల్లోకి తీసుకు రానున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నేటి నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు అందించనున్నట్లు తెలిపారు. జాతీయ ప్రమాణాల దిశగా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెట్ వర్క్ ఆసుపత్రిని గ్రేడింగ్ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. గ్రామాల్లో 13వేల క్లినిక్‌లు ప్రారంభిస్తామన్నారు జగన్. ఏప్రిల్ నాటికి గ్రామ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయి అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతున్నామని.. ఆరోగ్య శ్రీ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగదన్నారు జగన్. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే.. ఆరోగ్య శ్రీ వర్తిస్తుందన్నారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూదన్నారు.