జగనన్న చేదోడు పథకాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. 'జగనన్న చేదోడు' ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు.
ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. గ్రామ వాలంటీర్ల ద్వారా అర్హులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎవరికైనా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరకపోతే వారు గ్రామ, వార్డు సచివాలయాలకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని జగన్ సూచించారు. అర్హులందరికీ సాయం చేస్తామని చెప్పారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు.