CM Jagan: పార్టీ పక్షాళనపై సీఎం జగన్ దృష్టి
CM Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లను మార్చనున్న సీఎం
CM Jagan: దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సీఎం జగన్(CM Jagan) పార్టీపై దృష్టి సారించారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన ఏపీ ముఖ్యమంత్రి తన పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) లో రీజనల్ కో-ఆర్డినేటర్లను మార్చనున్నారు జగన్. మాజీమంత్రులు కొంత మందిని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా తూర్పుగోదావరి(East Godavari) జిల్లాకు రీజనల్ కో-ఆర్టినేటర్లుగా వైవీ సుబ్బారెడ్డితో(YV Subbareddy) పాటు మాజీమంత్రి కన్నబాబు పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాకు ఆళ్ల నాని, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కొడాలి నాని, పేర్ని నానిలను నియమించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పల్నాడు జిల్లాలకు మోపిదేవి, ప్రకాశం జిల్లాకు బాలినేని, నెల్లూరు జిల్లాకు అనిల్ కుమార్ యాదవ్‌ను రీజినల్ కో-ఆర్డినేటర్లుగా నియమిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రులుగా కొనసాగుతున్న పలువురు సీనియర్లకు కూడా జిల్లాల బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలను మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌కు అప్పగించే అవకాశం ఉంది. అలాగే మరో సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది. మరికొన్ని జిల్లాలకు ఎవరిని కో-ఆర్డినేటర్లుగా నియమించాలన్నదానిపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సజ్జల, ఎంపీ విజయసాయిరెడ్డికి తాడేపల్లి పార్టీ ఆఫీస్ సమన్వయ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.