నేడు టీడీపీ మహానాడు ముగింపు సభ...
TDP - Mahanadu: ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రస్తావించకుండానే రాజకీయ తీర్మానం...
TDP - Mahanadu: టీడీపీ మహానాడు ముగింపును పురస్కరించుకని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మాహానాడుకు టీడీపీ నేతలు, కార్యకర్తల భారీ ఎత్తున తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు జ్యోతి వెలిగించి మహానాడును ప్రారంభించారు. టీడీపీ బహిరంగ సభకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా ఏపీలోని వివిద జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెంలో ఏర్పాటు చేసిన మహానాడు ప్రాంగణంలోనే బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభ ప్రారంభం అవుతుందని.. ఐదు గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నారు. మహానాడు వేదిక పై నుంచి తొలిరోజు ఎన్నికల్లో పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానంలో నేతలు ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ కోసం పని చేసే వాళ్లకే అవకాశాలు వస్తాయని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు చంద్రబాబు. చేతకాని దద్దమ్మ జగన్ వల్ల రాష్ర్టం పరువుపోతుందన్నారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రతి ఇంట్లో చర్చించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని.. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. ఎవరు తప్పు చేసినా వదిలి పెట్టమని.. ప్రజా సమస్యలపైనే పోరాటమని మహానాడు వేదికపై నుంచి పిలుపునిచ్చారు.