6వ తరగతి బాలిక.. 10TH పాస్.. అది కూడా 566 మార్కులు.. ఎలా.. మరో బాలిక కూడా..
AP SSC Results 2023: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి.
AP SSC Results 2023: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. 72.26 శాతం ఉత్తీర్ణత సాధిస్తే అందులో బాలుర ఉత్తీర్ణత శాతం 69.27గా ఉంటే బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ రిజల్ట్స్ లో పార్వతిపురం మన్యం జిల్లా టాప్ గా నిలిస్తే నంద్యాల జిల్లా చివరస్థానంలో ఉంది. అయితే ఈసారి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు కొందరు పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షలు రాయడమే కాదు అందులో సత్తా చాటారు కూడా.
పూర్తి వివరాల్లోకి వెళితే..గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మీ(11) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతుంది. బాలిక తండ్రి విష్ణవర్థన్ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఉద్యోగి కాగా తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. ఇదిలా ఉంటే అనఘాలక్ష్మీ చిన్నప్పటి నుంచి చదువు పట్ల శ్రద్ధ ఎక్కువ. తల్లి ప్రోత్సాహంతో అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లో అనఘా లక్ష్మీ ప్రతిభ చాటుకుంటోంది. ఈ క్రమంలోనే గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరింది. చిన్నారి అనఘా ప్రతిభ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఆకర్షించింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అనఘా తన ప్రతిభను ప్రదర్శించిన వేళ వేదికపై మంత్రి కూడా ఉన్నారు. బాలిక ప్రతిభను చూసి మంత్రి ప్రశంసించడంతో పాటు 10వ తరగతి పరీక్షలు రాయించాల్సిందిగా బాలిక తల్లిదండ్రులకు మంత్రి సూచించారు.
మంత్రి సూచనలతో అనఘా తల్లిదండ్రులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. పాఠశాల డైరెక్టర్ రాము, విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకొని అనఘాను 10వ తరగతి పరీక్షలు రాయించారు. ఇక తాజాగా విడుదలైన ఫలితాల్లో అనఘా అందరికీ షాక్ ఇస్తూ పాస్ అవ్వడమే కాకుండా 10వ తరగతి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ఏకంగా 566 మార్కులు సాధించింది. అనఘా మార్కులను చూసి ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అనఘా మాత్రమే కాదు కాకినాడ జిల్లాలో ఆరవతరగతి చదువుతున్న మరో విద్యార్థిని హేమశ్రీ కూడా 10వ తరగతి పరీక్షలు రాసింది.
ఈ బాలిక కూడా పరీక్షల్లో తన సత్తా చాటింది. గాంధీనగర్ కు చెందిన ముప్పల సురేష్, మణిల కుమార్తె హేమశ్రీ స్థానికంగా ఉన్న మహాత్మా గాంధీ హై స్కూల్ లో 6వ తరగతి చదువుతోంది. చదువుల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చడంతో టీచర్లు ప్రోత్సాహించారు. హేమశ్రీ టాలెంట్ ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గుర్తించి 10వ తరగతి పరీక్షలు రాయించాల్సిందిగా సూచించారు. ఆయన సూచనల మేరకు అనుమతులు తీసుకొని హేమశ్రీతో పరీక్షలు రాయించగా తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆమెకు ఏకంగా 488 మార్కులు వచ్చాయి. చదివేది 6వ తరగతే అయినా 10వ తరగతి పరీక్షలు రాయడమే కాకుండా మంచి మార్కులు సాధించడంతో బాలికలు అనఘా లక్ష్మీ, హేమశ్రీలను అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.