Nara Lokesh: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు
Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు జారీ
Nara Lokesh: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో జరిగిన అవకతవకల విచారణ కోసం.. అక్టోబర్ 4న తమ ఎదుట హాజరు కావాలని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. విచారణ కోసం విజయవాడ సీఐడీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇచ్చామని,, విచారణకు సహకరిస్తానని లోకేష్ చెప్పినట్టు.. సీఐడీ అధికారులు వెల్లడించారు.
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి లావాదేవీలకు సంబంధించిన బుక్‌ను దర్యాప్తులో భాగంగా తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొంది సిఐడి. సాక్ష్యాలను నాశనం చేయడానికి ఏ విధంగానూ ప్రయత్నం చేయవద్దని కూడా నిబంధనల్లో పొందుపరిచింది దర్యాప్తు సంస్థ. సిఐడి నోటీసులో ఉన్న అంశాలు పాటించకపోతే... Cr.P.C సెక్షన్ 41A(3), (4) కింద అరెస్టుకు బాధ్యత వహిస్తారని నోటీసుల్లో స్పష్టం చేశారు సీఐడీ అధికారులు. సిఐడి నోటీసులు తీసుకుని... తాను స్వీకరించినట్లు పత్రాలపై నారా లోకేష్ సంతకం చేశారు.
సీఐడీ... వైసీపీ అనుబంధ విభాగంగా మారిందని లోకేష్ ఆరోపించారు. లేని కేసును చిత్రీకరించి.. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అసలు రోడ్డు నిర్మాణమే జరగలేదు.. అలాంటప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుందన్నారు లోకేష్.