ప్రమాదాలకు దారితీస్తున్న రసాయన పరిశ్రమల నిర్వాహకుల నిర్లక్ష్యం

Update: 2020-09-28 09:16 GMT

పారిశ్రామిక నగరం కాకినాడలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. రసాయనిక వ్యర్ధాల నిర్వహణలో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణలోపం కొన్ని పరిశ్రమల నిర్వాహకుల నిర్లక్ష్యం కలసి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. విష వాయువుల వ్యాప్తిపై వివాదాస్పదం అవుతున్నా ఇటువంటి ఘటనలపై చర్యలు లేకపోవడంతో రసాయనిక వ్యర్ధాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నా తూర్పుగోదావరి జిల్లాలో నిర్వాహకులు నిర్లక్ష్యంత వీడటం లేదు. వ్యర్థాల నిర్వహణలో అలసత్వం జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంభయంగా గడుపుతున్నారు జిల్లా వాసులు. కాకినాడ, రాజమండ్రి పరిధిలో రెండు ఆటోనగర్‌లు ఏపిఐఐసి ఆధ్వర్యంలో 24 పారిశ్రామిక పార్కులున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 8 అతి భారీ పరిశ్రమలు, 57 భారీ పరిశ్రమలు, 8వేలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అయితే తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదకర కేటగిరీలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

‌ఓ వైపు అధికారులు తనిఖీలు చేస్తున్నా పరిశ్రమల నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదు. కాకినాడ రూరల్ మండలం ఆటోనగర్‌లో ఈనెల 11న ఒక్కసారిగా ఘాటైన వాయువు స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటనతో ఇద్దరు డ్రైవర్లు అస్వస్థతకు గురయ్యారు. రైతులు కళ్ల మంటలు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఘటనాస్థలంలో పరిశ్రమల్లో వాడి పడవేసిన అమోనియా ఖాళీ డ్రమ్ములు ఉండటం వాటిలో మిగిలిన అమ్మోనియా వల్ల ప్రమాదం జరిగినట్టు గుర్తించారు అధికారులు.

కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో బల్క్ డ్రగ్ తయారీ పరిశ్రమ టైకీ ఇండ్రీస్ లోనూ ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. మే 31న అర్ధరాత్రి ఘాటైన వాయువులు ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో స్ధానికులు ఆందోళన చెందారు. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసినా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు. కొందరు పరిశ్రమల నిర్వాహకులు వ్యర్థాలను కాలువలు, సముద్రంతో పాటు శివారు ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఇలాంటి వ్యర్థాలు రోడ్ల పక్కనే కనిపించడంతో ఆందోళన చెందుతోన్న ప్రజలు నిర్లక్ష్యం వహిస్తోన్న పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News