Weather Today: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. 5 రోజులు దంచుడేదంచుడు

Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. ఒడిశా నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తోంది. నేడు సాయంత్రానికి ఇది పూర్తిగా బలహీనపడిపోతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా గంటకు 35 నుంచి 45కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి వాతావరణం కారణంగా వచ్చే 5 రోజులపాటూ ఏపీ, యానాం, తెలంగాణ, తమిళనాడు, పుదచ్చేరి, కేరళ, కర్నాటకలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
నేడు ఏపీ, తెలంగాణ వాతావరణ సూచన ప్రకారం రెండు రాష్ట్రాలలోనూ వాతావరణం కొంతవరకు అస్థిరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఎండీ ప్రకారం నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాలు ఇటీవలి వేడిగాలుల నుంచి కొంత ఉపశమనం కలిగించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అటు ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. రాయలసీమ, ఉత్తరకోస్తాంధ్రలో వాతావరణం పాక్షికంగా మేఘావ్రుతంగా ఉండవచ్చు. అయితే భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పలేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండవచ్చనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.