Chandrababu: చంద్రబాబుకు షాక్.. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత
Chandrababu: 36 గంటల ఉత్కంఠకు తెరపడింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో 271 కోట్ల రూపాయల స్కాం జరగ్గా.. అందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ ఆయన్ను నిన్న నంద్యాలలో అదుపులోకి తీసుకుంది. ఈ ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు వాడివేడిగా వాదనలు జరిగాయి. కోర్టులో స్వయంగా బాబు తన వాదనలు విన్నారు. అటు చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ వాదనలు వినిపించారు. 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన సీఐడీ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో A1గా చంద్రబాబునాయుడు, A2గా అచ్చెన్నాయుడును చేర్చింది. కుంభకోణం జరిగినట్లు అభియోగం మోపింది. 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ఇవ్వాలని కోరింది.
కోర్టులో తన వాదనలు వినిపించిన చంద్రబాబు.. రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. తన అరెస్ట్ అక్రమమని.. స్కిల్ స్కామ్‌తో తనకు సంబంధం లేదన్నారు. మరోవైపు చంద్రబాబు తరపున వాదించిన లూథ్రా.. గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదన్నారు. స్కీమ్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం అని.. రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని లాయర్ సిద్ధార్థ్ లూథ్రా నోటీస్ ఇచ్చారు. సెక్షన్ 409 పెట్టాలి అంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలన్నారు. శనివారం ఉదయం 5.40నిమిషాలకు నోటీస్ ఇస్తే.. ఆదివారం ఉదయం 5.40 నిమిషాలకు.. రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలన్న నిబంధనను పాటించలేదన్నారు లూథ్రా.
చంద్రబాబు వాదనల తర్వాత సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ స్కాంకు 2015లో జీవో- 4 ద్వారా కుట్ర మొదలైందని, చంద్రబాబే నేరానికి ప్రేరేపించారని సీఐడీ తన వాదనలు వినిపించింది. ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చారని, మోసాలకు పాల్పడేందుకు ఫోర్జరీ కూడా చేశారన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని సీఐడీ పేర్కొంది.
ఇక చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన తరఫు లాయర్లు చెప్పడం లేదని... సీఐడీ తరపు లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారన్నారు. ఎంతసేపూ సాంకేతిక అంశాలగురించి మాట్లాడుతున్నారు తప్ప.. ఆధారాలు తప్పని కాని, అవినీతి జరగలేదని కాని చెప్పడంలేదని కోర్టులో తన వాదనలు వినిపించారు.
ఇక చంద్రబాబు తరపు లాయర్లు.. ఆయన్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరమని వాదించగా.. స్పీకర్ కు సమాచారం ఇస్తే చాలని తెలిపారు సీఐడీ తరపు లాయర్. అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి అనేది గౌరవ ప్రదమైన హోదా మాత్రమే అని.. ప్రస్తుతం చంద్రబాబు వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమే అన్నారు. అరెస్టుకు ముందు స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. ఆ విధంగా స్పీకర్ కు సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. గవర్నర్ కు అరెస్టయిన మూడునెలలోపు ఎప్పుడైనా సమాచారం ఇవ్వొచ్చని కోర్టుకు తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఐడీ వాదనలతో ఏకీభవించింది. చంద్రబాబుకు 14 రోజలు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశిస్తూ.. అటు జైలు అధికారులకు కూడా మౌఖిక ఆదేశాలిచ్చింది. తీర్పు వెలువరించగానే.. చంద్రబాబు తరపు లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తిరస్కరించింది ఏసీబీ కోర్టు. దీంతో టీడీపీ లీగల్ సెల్ రేపు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబును తమకు కస్టడీలోకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.