Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రమాదకరమైన వైరస్
Chandrababu: సాధారణ కరోనా వైరస్ కంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ రకం 10 రెట్లు ప్రమాదకరమని చంద్రబాబు తెలిపారు
Chandrababu: ఏపీలో ప్రమాదకరమైన మ్యుటెంట్ స్ట్రెయిన్ వ్యాపిస్తోందా? అందుకే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయా? ఇదే ప్రచారం సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా జరుగుతోంది. ఇప్పుడు అవే కామెంట్లను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేయటంతో.. అందరూ ఉలిక్కిపడుతున్నారు. సాధారణ కరోనా వైరస్ కంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ రకం 10 రెట్లు ప్రమాదకరమని చంద్రబాబుచెబుతుండటంతో టెన్షన్ పెరుగుతోంది.
ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే అత్యంత ప్రమాదకరమైనదని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆన్‌లైన్ ద్వారా సమావేశమైన చంద్రబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్‌ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని వ్యాఖ్యానించారు. కరోనాకు చెందిన ఇతర వైరస్‌ల కంటే కన్నా ఇది 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీలో లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిందని చంద్రబాబు అన్నారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్న చంద్రబాబు.. ఈ విషయంలో జగన్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న టీడీపీ అధినేత.. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని సూచించారు.