Chandrababu Naidu: కొల్లు రవీంద్ర అరెస్ట్ అక్రమం..బీసీలపై కక్షకట్టారా?
Chandrababu Naidu: కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
Chandrababu Naidu: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రవీంద్రను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. రవీంద్ర అరెస్టును చంద్రబాబు తీవ్రంగా ఆయన ఖండించారు. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకున్నందునే రవీంద్రను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. బీసీలను జగన్ రెడ్డి ప్రభుత్వం పండగరోజు కూడా సంతోషంగా ఉండనీయడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు దిగిన వైసీపీ నాయకులను ఎంతమందిని అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. కొల్లు రవీంద్ర చేసిన నేరమేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు పతాక స్థాయికి చేరుకున్నాయని ఆయన విమర్శించారు. సీఎం జగన్ బీసీల వ్యతిరేకి అని తర్వలోనే బీసీలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చంద్రబాబు హెచ్చరించారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లి దొంగఓట్లు వేసిన వైసీపీ నేతలపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుపై రవీంద్ర వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లు రవీంద్ర ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు చేరకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గర పోలీసులు, కొల్లు రవీంద్ర మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఎస్సైపై చేయి చేసుకున్న ఘటనలో కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు.