Chandrababu Naidu: భక్తుల మనోభావాల విషయంలో తగ్గేదేలే: చంద్రబాబు

Update: 2024-10-09 10:35 GMT

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో కనక దుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. దసరా సందర్భంగా ఆనవాయితీ ప్రకారమే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. దసరా అంటేనే చెడుపై మంచి విజయం సాధించిన సందర్భమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి దయ వల్ల రాష్ట్రంలో ఈసారి పుష్కలంగా వర్షాలు కురిశాయి. కృష్ణా నదిలోకి భారీగా నీరు వచ్చి చేరిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయంలో, ప్రార్థనా మందిరాల్లో మీ మనోభావాలకు అనుగుణంగా నడుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. ఇటీవల తిరుపతిలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వివాదంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Full View

రాబోయే రోజుల్లో దేవాలయాల్లో ఆదాయంపై దృష్టిసారించడంకంటే ఎక్కువగా పేద ప్రజలే ధ్యేయంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం, వారి మనోభావాలను గౌరవించే విధంగానే ఆలయాల పాలకమండళ్లు నడుచుకుంటాయని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే సంప్రదాయాలు అనుసరిస్తాం. అక్కడి పద్ధతులు, చట్టాలను గౌరవిస్తాం. ఇదొక ఆనవాయితీగా కొనసాగించి మళ్లీ ప్రతీ ఒక్క దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం అని ప్రకటించారు. 

Tags:    

Similar News