Chandrababu Naidu: మళ్ళీ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర
ఎన్ డీ ఏ కన్వీనర్ గా పనిచేసిన జార్జి ఫెర్నాండెజ్ అనారోగ్య కారణాలతో ఈ పదవి నుండి తప్పుకోవడంతో శరద్ యాదవ్ ఈ పదవిని చేపట్టారు. ఈ పదవికి శరద్ యాదవ్ రాజీనామా చేయడంతో చంద్రబాబునాయుడు ఈ పదవిని చేపట్టారు.
Chandrababu Naidu: చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఎన్ డీ ఏ లో చంద్రబాబు చేరారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘన విజయం సాధించింది. ఎన్ డీ ఏ కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ టీడీపీ. మిత్రపక్షాలపై ఆధారపడే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి వచ్చింది.
చంద్రబాబు 2004 వరకు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర
2004 వరకు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన రాష్ట్ర రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 2004లో ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. దీనికితోడు ఇతర రాజకీయ పరిణామాలు కూడా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యేలా చేశాయి. 2019 ఎన్నికలకు ముందు ఎన్ డీ ఏ నుండి చంద్రబాబునాయుడు బయటకు వచ్చారు. కర్ణాటకలో హెచ్ డీ కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీయేతర పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. కానీ, జాతీయ రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఘోరఓటమితో పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ పెట్టారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో బాబు కీలకం
కేంద్రంలో బీజేపీ,కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. 1996లో లెఫ్ట్ సహా 13 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు. 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ఉనికిలో ఉంది. 1996లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ లో విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోవడంతో వాజ్ పేయ్ సర్కార్ కుప్పకూలింది. ఈ సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు ముందుకు రాలేదు. అయితే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు కూటమిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే బయట నుండి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు దేవేగౌడ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో దేవేగౌడ స్థానంలో ఐ.కె గుజ్రాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1997 ఏప్రిల్ 21 నుండి 1998 మార్చి 19 వరకు గుజ్రాల్ ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత లోక్ సభ రద్దైంది. ఎన్నికలు జరిగాయి. యునైటెడ్ ఫ్రంట్ కూడా విచ్చిన్నమైంది.
ఎన్ డీ ఏ కన్వీనర్ పాత్రలో...
నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్ డీ ఏ) 1998లో ఏర్పాటైంది. బీజేపీ ఈ కూటమిని ఏర్పాటు చేసింది. తొలుత ఎన్ డీ ఏ చైర్ పర్సన్ గా అటల్ బిహరి వాజ్ పేయ్ పనిచేశారు. 2004లో ఎన్ డీ ఏకు ఎల్ కే అద్వానీ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. లెఫ్ట్, కాంగ్రేసేతర పార్టీలు ఈ కూటమిలో చేరాయి. సమతా, ఎఐఎడిఎంకె, శివసేనలు భాగస్వామ్యులుగా చేరాయి. అయితే ఈ కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ బయటి నుండి మద్దతు ఇచ్చింది. అయితే 1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్ డీ ఏ కన్వీనర్ గా పనిచేసిన జార్జి ఫెర్నాండెజ్ అనారోగ్య కారణాలతో ఈ పదవి నుండి తప్పుకోవడంతో శరద్ యాదవ్ ఈ పదవిని చేపట్టారు. ఈ పదవికి శరద్ యాదవ్ రాజీనామా చేయడంతో చంద్రబాబునాయుడు ఈ పదవిని చేపట్టారు. 2004 లో ఓటమి తర్వాత ఎన్ డీ ఏ కు చంద్రబాబు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్ డీ ఏలో చేరింది. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా విషయమై మోడీతో విబేధించి ఎన్ డీ ఏకు చంద్రబాబు దూరమయ్యారు.
చంద్రబాబుకు కలిసివచ్చిన అవకాశం
ప్రత్యేక హోదా విషయమై 2019 ఎన్నికల ప్రచారంలో మోడీని, బీజేపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన స్వరంలో మార్పు వచ్చింది. ప్రత్యేక హోదా విషయంలోనే తాను బీజేపీపై విమర్శలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 400కు పైగా ఎంపీ స్థానాల్లో విజయం కోసం గతంలో ఎన్ డీ ఏలోని పక్షాలను తిరిగి కూటమిలో చేరాలని బీజేపీ ఆహ్వానాలు పలికింది. అదే సమయంలో ఎన్ డీ ఏ కూటమిలో చేరేందుకు టీడీపీ కూడా ఆసక్తిగా ఉన్నట్టుగా సంకేతాలు పంపింది. టీడీపీని ఎన్ డీ ఏలో చేర్చడంలో జనసేన పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా వ్యవహరించారు. బీజేపీ ఆహ్వానం మేరకు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్ డీ ఏలో చేరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ డీ ఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ లోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్ డీ ఏ కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలున్న పార్టీ టీడీపీయే. ఈ అవకాశం ప్రస్తుతం చంద్రబాబుకు కలిసి వచ్చింది. ఎన్ డీ ఏలో చంద్రబాబు కీలకభాగస్వామిగా మారారు. ఈ పరిణామం రాష్ట్రానికి అవసరమైన నిధులు, ఇతర అంశాలను రాబట్టేందుకు దోహదం చేసే అవకాశం లేకపోలేదు. సంకీర్ణ ప్రభుత్వంలో పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వాలు తమ కీలక భాగస్వామ్యపక్షాల డిమాండ్లను అనివార్యంగా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మక స్థానంలో ఉన్నట్లే భావించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేరకు మేలు చేస్తుందన్న ఆలోచనలు ఇప్పటికే ప్రజల్లో మొదలయ్యాయి.