Chandrababu: గులాబీ బాస్‌ బాటలోనే చంద్రబాబు.. రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు

Chandrababu Naidu: కుప్పంలో ఓడిపోతారనే భయంతోనే మరో చోట పోటీ చేస్తున్నారని చురకలు

Update: 2023-08-30 11:12 GMT

Chandrababu: గులాబీ బాస్‌ బాటలోనే చంద్రబాబు.. రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు

Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన పార్టీలు.. అటు ప్రచారంపైనా దృష్టి పెడుతున్నాయి. తెలంగాణలో అయితే.. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉంది. ఇక.. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి రానున్న వారం రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ సారి గులాబీ బాస్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఆయన బరిలో నిలవనున్నారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి కుప్పంతో పాటుగా మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో జరుగుతోంది. గుంటూరు లేదా కృష్ణా జిల్లాల్లో టీడీపీ బలంగా ఉండే ఓ నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంచుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. చంద్రబాబు తొలిసారి ఇలా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినట్లు అవుతుంది. అయితే.. అటు చంద్రబాబు రెండు స్థానాల్లో పోటీ చేస్తారనేదానిపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో.. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో వైసీపీకి బలం పెరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో విపరీతంగా వినిపిస్తోంది. కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. మున్సిపాలిటీ సహా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, పంచాయతీల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. ఈ పరిణామాలన్నీ చూసిన చంద్రబాబు.. ముందుగానే జాగ్రత్త పడుతున్నారని, అందుకే రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఇక.. చంద్రబాబు రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలపై వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కుప్పంలో ఓడిపోతారని భావించే మరో నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేయబోతున్నారంటూ ఫ్యాన్‌ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో గెలవాలని వైఎస్సార్‌సీపీ పట్టుదలతో ఉంది. ఆ దిశగా వైఎస్సార్‌సీపీ కార్యాచరణను అమలు చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు గనుక రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి రేగుతోంది.

Tags:    

Similar News