అసలే పార్టీ ఓడిపోయిన బాధలో వున్న చంద్రబాబుకు, వైజాగ్‌లో మహాకోపం వచ్చిందట. ఆలూ లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా, అసలే పవర్‌లో లేని పార్టీలో, రచ్చ చేసిన కొందరు నాయకులపై, యమ సీరియస్ అయ్యారట చంద్రబాబు. ఇంతకీ బాబు ఆగ్రహానికి గరైన ఆ నేతలెవరు ఆ సందర్భం ఏంటి?
ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత, జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షా సమావేశాలు మొదలుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఒక్కో చోట ఒక్కో అనుభవం ఎదురవుతోంది. నేతల తీరు చూసి, బాబు షాక్ అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఐక్యంగా వుండాల్సిన నాయకులు, ఇప్పుడు కూడా ఇన్‌ఛార్జ్ పదవుల కోసం వెంపర్లాడటం చికాకు తెప్పిస్తోందట. తాజాగా విశాఖపట్నంలో, కొందరు నేతల వ్యవహారంపై బాహాటంగా సీరియస్ అయ్యారట చంద్రబాబు. దీంతో ఒక్కసారిగా సమావేశం హాట్‌హాట్‌గా మారిందట.
విశాఖలోని పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశాల్లో పలు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాడుగుల నియోజకవర్గంపై చర్చ వచ్చింది. మాడుగుల టీడీపీకే కంచుకోటగా నిలిచిందన్న బాబు, గత రెండు ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఆరా తీశారు. దీంతో కొంతమంది నాయకులు, పార్టీ ఓటమిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కొంతమంది ముఖ్య నాయకులతోపాటు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో ఓటమిపాలయ్యామన్నారు. కాగా అభ్యర్థి ఎంపికలో జాప్యం, సీజనల్ నాయకుల గ్రూపుల కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామని మరికొందరు నేతలు మనసులో ఉన్నదంతా వెళ్లగక్కారట.
అయితే, మాడుగులపై సమీక్షంలో ఇద్దరు ముగ్గురు నాయకులు పైకి లేచి కాస్త గట్టిగానే గళం విప్పారట. పైలా ప్రసాదరావును నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించాలంటూ, నినాదాలు చేశారట. మరికొందరు పైలాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారట. దీంతో మీటింగ్‌లో గందరగోళం నెలకొంది. మధ్యలో జోక్యం చేసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు, ఏకంగా వారిపై ఫైరయ్యారట. పైలా ప్రసాదరావు పార్టీకి ఎప్పుడు పనిచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. బాబు కోపాన్ని చూసిన నేతలు, ఎవరికివారే, కుక్కిన పేనులా ఎవరి సీట్లలో వారుండిపోయారట.
ఇదే సందర్భంలో మాడుగుల ఇన్‌చార్జీ గవిరెడ్డి రామానాయుడుకు అనుకూలంగా కొందరు మాట్లాడారట. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఐదేళ్ల ఉంచి పార్టీ కోసం నిరంతరం పాటు పడుతున్నారని, ఆయననే ఇన్‌చార్జిగా కొనసాగించాలన్నారట. దీనిపై స్పందించిన చంద్రబాబు, కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారట. ప్రస్తుత ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు పనితీరును ఆరు నెలలపాటు పరిశీలిస్తానని, బాగుంటే ఇన్‌చార్జిగా కొనసాగిస్తానని అన్నారట. ఈ పరిణామాలతో పైలా ప్రసాదరావు వర్గీయులు నిరుత్సాహపడగా, గవిరెడ్డి వర్గీయులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే, ఓడిన వెంటనే ఇన్‌చార్జీలను తొలగిస్తే, గందరగోళం పెరుగుతుందని భావించిన చంద్రబాబు, ఉన్నవారినే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పటికే ఉన్నవారిని మరో ఆరు నెలల పాటు, కొనసాగించాలని నిర్ణయించారట. అయితే, వర్గాలుగా విడిపోయిన నేతలు, చంద్రబాబు సమక్షంలో గొడవపడటం మాత్రం, శ్రేణులను షాక్‌కు గురి చేసిందట. అయితే, ఇలాంటి ఆగ్రహావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని, సామరస్యపూర్వకంగా నడుచుకోవాలని, నేతలకు వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు.