Chandrababu: నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ
Chandrababu: హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో సవాల్
Chandrababu: ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గత నెల 12న చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. ఈ కేసు అక్టోబరు 13, 17, 20వ తేదీల్లో ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసులు నమోదు చేయడాన్ని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ దీనికంటే ముందే విచారణలో ఉండటంతో ఆ కేసులో తీర్పు వెలువరించాక...
దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పి గత నెల 20న సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సెక్షన్17-A కేసులో తీర్పు ఈ నెల 7లోపు వెలువరిస్తామని సంకేతమిస్తూ ముందస్తు బెయిల్ కేసు విచారణను నవంబరు 9కి వాయిదా వేసింది. 17-A కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం కానీ, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని ధర్మాసనం మౌఖికంగా ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే సుప్రీంకోర్టు గతంలో చెప్పినట్లు 17-A కేసులో ఇప్పటి వరకు తీర్పు వెలువరించలేదు.
ఈరోజు నాటి జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. దీంతో ఇవాళ ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెలువరిస్తారా? లేదంటే 17-ఎ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.