తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్.. అకాడమీ పెద్దల సంతకాలు ఫోర్జరీ

* అకాడమీ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు కలిసే నిధుల మాయం * మాయమైన నిధులన్ని అగ్రసేన్ బ్యాంకు ఖాతాలో జమ

Update: 2021-10-02 05:00 GMT

తెలుగు అకాడమీ (ఫైల్ ఫోటో)

Telugu Akademi: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అకాడమీ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు కలిసే నిధులు మాయం చేసారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 63 కోట్ల రూపాయలు ఏపీ మార్కంటైల్‌ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ అధికారుల హస్తం బయటపడింది.

అకాడమీ పెద్దల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో బట్టబయలైంది. ఈ కేసులో భాగస్వాములైన కార్వాన్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో పాటు ఏపీ మార్కంటైల్‌కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్, మేనేజర్, అదే సొసైటీకి చెందిన మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 11 బ్యాంకులకు సంబంధించి 30 అకౌంట్లలో 320 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కార్వాన్ యూనియన్ బ్యాంక్‌లో ఉన్న 43 కోట్లు విత్‌డ్రా కోసం ప్రయత్నించగా నిధుల గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో మరో 20 కోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సంతోష్‌నగర్ యూనియన్ బ్యాంకు నుంచి పది కోట్లు చందానగర్ కెనరా బ్యాంకు నుంచి మరో పది కోట్లు ఇతర అకౌంట్‌లలోకి బదిలీ అయ్యాయని అకాడమీ అధికారులు ఫిర్యాదు చేశారు. మాయమైన నిధులన్ని అగ్రసేన్ బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. గోల్‌‌మాల్ అయిన నిధులన్నీ అగ్రసేన్ బ్యాంకు ఖాతాలోకి ఎవరు మళ్లీంచారు..? అసలు అగ్రసేన్ బ్యాంకు ఖాతా ఎవరిది అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.

Tags:    

Similar News