రెండు మూడు రోజుల్లో ఏపీలో కీలక పరిణామాలా?

Update: 2019-11-09 10:22 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ, అసెంబ్లీలో అధ్యక్షా అనాలని తపిస్తోందా బీజేపీ వాయిస్‌ వినిపించాలని పట్టుదలగా వుందా అందుకే టీడీపీ ఎమ్మెల్యేలపై గాళం వేస్తోందా గంటాతో పాటు మరికొందరికి కాషాయ కండువా కప్పి, ఏకంగా బీజేపీ శాసన సభాపక్షం ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచిస్తోందా వీటన్నింటికి ఔననే సమాధానమే ఉండొచ్చని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి పార్టీ మారితే అనర్హత వేటు తప్పదన్న స్పీకర్, కాషాయ కండువా కప్పుకునే టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తారా రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది?

అసెంబ్లీలో బీజేపీ శాసన సభా పక్షం కొలువుదీరడం ఖాయమా?

టీడీపీ ఎమ్మెల్యేలే బీజేపీ సభ్యులుగా అధ్యక్షా అనబోతున్నారా?

మరి బీజేపీలో చేరే టీడీపీ ఎమ్మెల్యేలపై అనర‌్హత వేటు పడుతుందా?

ఈ విషయంలో బీజేపీతో స్పీకర్‌ ఢీ అంటే ఢీ అంటారా?

ఏపీలో బీజేపీ తరపున ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పడంతో, కాంగ్రెస్‌ను వేటేసినట్టే, కమలదళాన్ని కూడా ఓడించారు. సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలను సైతం దారుణంగా ఓడించారు. దీంతో అసెంబ్లీలో కాషాయదళానికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండాపోయారు. కానీ టీడీపీ సంక్షోభంలో ఉందన్న ఆలోచనతో, ఆ పార్టీని ఎలాగైనా రీప్లేస్ చెయ్యాలని తపిస్తోంది. అందుకు సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నారు అమిత్‌ షా. అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు అమిత్‌ షా.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం 23 మంది. వీరిలో సగానికిపైగా బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. వీరందరీతో కలిసి, అసెంబ్లీలో బీజేపీ శాసన సభా పక్షం ఏర్పాటుకు కమలదళం ప్రయత్నిస్తోందని సమాచారం. ఇదే విషయం రాంమాధవ్‌‌తో పాటు సుజనా చౌదరితోనూ గంటా శ్రీనివాస రావు డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకుంటే, అనర్హత వేటు పడటం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, ఎవరు పార్టీ మారినా, వారిపై అనర్హత వేటు వేయాలని, తొలి అసెంబ్లీ సమావేశంలోనే స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు విజ్తప్తి చేశారు సీఎం జగన్. మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకుంటే, స్పీకర్ తమ్మినేని ఏం చేస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యేల వలసలపై మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్లపై బీజేపీ కన్నేసిందని, వారిని సెలక్ట్ చేసుకుందని తెలుస్తోంది. అందుకే టీడీపీకి చెందిన కొందర్నీ, పార్టీలోకి తీసుకోవద్దని, స్వయంగా బీజేపీ చీఫ్‌ అమిత్ ‌షా, వైసీపీ కీలక నాయకులతో అన్నారట. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం, పార్టీలో చేర్చుకోవద్దని, అతను తమకు కావాలని కాషాయ అగ్రనేతలు వైసీపీ నాయకులకు స్పష్టం చేశారట. వారు వస్తామన్నా చేర్చుకోవద్దని స్పష్టంగా చెప్పారట. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలోనూ, గతంలో ఇలాగే జరిగిందని ప్రచారం జరిగింది. వైసీపీలోకి వెళ్లాలని కన్నా దాదాపు డిసైడైన తరుణంలో, ఏకంగా అమిత్‌ షా, వైసీపీ అధినాయకులకు ఫోన్ చేసి, కన్నాను చేర్పించుకోవద్దని చెప్పారట. దీంతో వైసీపీలో కన్నా చేరికకు అక్కడితో ఫుల్‌స్టాప్ పడింది. ఇప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందర్ని సెలక్ట్ చేసుకుని, ఏపీలో బలపడాలని బీజేపీ చూస్తోందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గంటాతో పాటు మరో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో చక్రంతిప్పి, మరికొందర్నీ పార్టీలో చేర్పించుకుని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కంకణం కట్టుకుందట కాషాయదళం.

బీజేపీ వ్యూహాలు అర్థం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఇలాంటి వలసలను ఆపేందుకు ఏకంగా ఆరెస్సెస్‌ పెద్దలతోనే మాట్లాడినట్టు తెలుస్తోంది. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ కీలక నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారని, టీడీపీని బీజేపీ టార్గెట్ చేసిన తీరును వివరించారని, ఇది సరైంది కాదని బాబు అన్నారట. ఇప్పటికే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ‌్యులను బీజేపీ లాగేసిందని, ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలను సైతం బలవంతంగా పార్టీ మార్పించేందుకు ట్రై చేస్తోందని బాబు వారితో అన్నారట. ఎలాగైనా వలసలను ఆపాలని ఆరెస్సెస్‌ పెద్దలకు విజ్తప్తి చేశారట.

మొత్తానికి రెండు మూడు రోజుల్లో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశంతో పాటు కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు సైతం కమలంలోకి వెళతారని తెలుస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని, రెండు రోజుల్లో బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. గంటాతో ఢిల్లీలో చర్చలు జరిపిన బీజేపీ పెద్దలు, ఏపీలో ఇతర ఎమ్మెల్యేలను సైతం, పార్టీలో చేర్పించేందుకు ఎలాంటి ప్రణాళికలు, ఎలా అమలు చేయాలో గంటాకు బోధించినట్టు తెలుస్తోంది. చూడాలి, రానున్న రోజుల్లో ఏపీలో ఎలాంటి రాజకీయ సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయో.

Full View

Tags:    

Similar News