BJP Stand on AP Capital : రాజధాని వికేంద్రీకణ బిల్లుపై ఇరకాటం కన్నాదా...బీజేపీదా?
BJP Stand on AP Capital : మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ రెండు గొంతుకలు వినిపిస్తోందా...? రాజధాని అమరావతేనని రాష్ట్ర అధిష్టానం లేఖలు రాస్తుంటే, కేంద్ర అధిష్టానం అసలు లెక్కే చేయటం లేదా...? రాష్ట్ర నేతలకూ, కేంద్ర పెద్దల ప్రకటనలకూ అస్సలు సంబంధం లేకపోవటం వ్యూహమా...? లేక లోపమా....? మరి మధ్యలో జనసేనాని లెక్కేంటి...? ఆయనకు వచ్చే చిక్కేంటి...?
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై తుదినిర్ణయం ఇప్పుడు రాజ్ భవన్ కు చేరిన నేపథ్యంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లులపై వైసీపీ, టిడిపిల వాదనేంటనేది సుస్పష్టంగా కనిపిస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్టాండనేది మాత్రం ఎవరికీ అండర్ స్టాండ్ కావటం లేదు. ప్రభుత్వం ఈ రెండు బిల్లులను పంపటం రాజ్యాంగ విరుద్ధమనీ, ఇది ప్రజాభీష్టానికి వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాశారు. రాజధాని కోసం రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారనీ, వారు చేస్తోన్న శాంతియుత పోరాటాన్ని గుర్తించాలని గవర్నర్ ను కోరారు కన్నా.దీంతో బీజేపీ కూడా తమ పక్షాన నిలబడిందని అమరావతి జనం ఆనందించేలోపు, ఢిల్లీ నుంచి వచ్చే వార్తలు గందరగోళంలో పడేస్తున్నాయి. కన్నా స్టాండ్ టిడిపి వైఖరి మాదిరిగా ఉందనీ, ఆయన నిర్ణయంపై కేంద్ర అధినాయకత్వం ఆగ్రహంతో ఉందన్నది సదరు వార్తల సారాంశం. పనిలోపనిగా వైసీపీ ఎంపి సాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణపై చేస్తున్న ట్వీట్లు మరింత హీట్ రాజేస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నుంచి డబ్బులు తీసుకుని ఆ పార్టీ స్టాండ్ ను మోస్తున్నారన్న ఆరోపణలు, కన్నాకంట్లో నలుసుగా మారాయి. ఇక కన్నాపై గుర్రుగా ఉన్నారంటున్న కేంద్రనాయకత్వం ఎవరో కానీ, వారు బయటకు వచ్చి మాట్లాడరు. ఒకవేళ వచ్చినా వారు చెప్పేది పూర్తిగా ఎవరికీ అర్థంకాదు, ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి లాంటి నేతలు పరిపాలనా రాజధానిగా అమరావతికే తమ మద్దతని చెప్తోంటే, రాష్ట్ర ఇంచార్చి సునీల్ థియోదర్ మాత్రం రాజధానిపై కేంద్రం జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొడుతున్నారు. ఎన్ని రాజధానులు పెట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని ఆయన చెప్పటం రాష్ట్ర నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
దీంతో రాజధాని తరలింపుపై బీజేపి వైఖరేంటనేది రాష్ట్ర ప్రజలకే కాదు ఆపార్టీ నేతలకు కూడా ఓ పట్టాన అంతుబట్టటం లేదు. పూటకో రకంగా మాట్లాడుతూ ఎవరికి కుదిరినట్లు వారు గందరగోళాన్ని తమ పార్టీ కేరాఫ్ గా మార్చేసుకుంటున్నారు. ఇక కమలం కథ ఇలా ఉంటే, మిత్రపక్షమైన జనసేన వైఖరేంటనేది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. రాజధాని అమరావతిని తరలించకుండా బీజేపీతో కలసి పోరాటం చేస్తామని జనసేనాని పవన్, పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కు సైతం బీజేపీ స్టాండేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. లేదంటే అసలే అంతంత మాత్రంగా ఉన్నపరిస్థితుల్లో, అమరావతి అంశంపై బీజేపీని నమ్ముకోవటం వల్ల ఇంకొంచెం మునిగేది గాజుగ్లాసే.
ఏది ఏమైనప్పటికీ రాజధానిపై ఇలా రెండు నాల్కల ధోరణికి చెక్ పెట్టి, తమ విధానం ఇదని స్పష్టంగా చెప్పగలిగితే బీజేపీకి రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆదరణ ఉంటుంది. లేదంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం బండి ముందుకు నడవని పరిస్థితి వచ్చే ప్రమాదముంది. కాబట్టి రాజధానుల బిల్లులు రాజ్ భవన్ దాటి ముందుకు వస్తే, కేంద్రం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటుందా...? లేక రాష్ట్ర నేతల రాజకీయ భవిష్యత్తునీ, రాజధాని రైతుల డిమాండ్‌నీ పణంగా పెడుతుందా అన్నది తేలాల్సి ఉంది. సో అప్పటివరకూ బీజేపీ గోపీ అలియాస్ గోడమీద పిల్లివాటమే అనుకోవాలేమో.