ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం
Somu Veerraju: హిందూ పండుగలకే నిబంధనలు గుర్తుకు వస్తాయా?
Somu Veerraju: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం నెలకొంది. నిబంధనలు, రుసుముల పేరుతో గణేష్ ఉత్సవ కమిటీలను వేధిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి రుసుం చెల్లించక్కర్లేదని ప్రభుత్వం చెబుతోంది.గణేష్ మండపాల ఏర్పాటుకు ఫైర్, విద్యుత్, పోలీసుల అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే విద్యుత్, పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోమనడం నిబంధనలు కావా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని, సీఎం జగన్ అక్కడికి వెళ్తే తెలుస్తుందన్నారు. రాజమండ్రిలో నిర్వహించే వినాయక వేడుకల్లో తాను స్వయంగా పాల్గొంటానన్నారు. ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి అనుమతి తీసుకోనని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు సోము వీర్రాజు. హిందూ పండుగలకే నిబంధనలు గుర్తొస్తాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వినాయక మండపాలపై ఏర్పాటుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబును వినాయకుడు క్షమించడంటూ వైసీపీ కౌంటర్ అటాక్ కు దిగింది. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వినాయక మండపాలకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదన్నారు. మండపాలకు విద్యుత్ స్లాబ్ ధర తగ్గించామన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా 9 రోజుల మైక్ పర్మిషన్ కు వెయ్యి రూపాయలే అన్నారు. వినాయక చవితి వేడుకలకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. రుసుముల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదన్నారు. దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సోము వీర్రాజు, చంద్రబాబులపై కేసులు పెట్టాలన్నారు.
ఏపీలో వినాయక చవితి వేడుకలకు నిబంధనలకు సంబంధించి డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్పందించారు. చవితి వేడుకలపై ప్రత్యేక ఆంక్షలు ఏమిలేవన్నారు. భద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లకు అనుమతి ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.