కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి : ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగిన బీజేపీ

Update: 2020-09-24 08:09 GMT

ఏపీలో బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిక్లరేషన్ వివాదంలో తిరుమల శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

మంత్రి కొడాలి నానిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని, హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్న వ్య‌క్తిని ఎలా మంత్రివ‌ర్గంలో ఉంచుకుంటార‌ని బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సీఎం జ‌గ‌న్ కొన్ని కులాలు, కొన్ని మ‌తాల‌కు మాత్ర‌మే ముఖ్య‌మంత్రా అని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా తిరుమ‌ల‌లో రెచ్చ‌గొట్టే విధంగా వ్యాఖ్యానించార‌ని మండిప‌డ్డారు. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమాన పర్చారని మండిపడ్డారు. గుడివాడలో బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Tags:    

Similar News