Swachh Survekshan 2020: స్వచ్చ సర్వేక్షణ్ లో ఏపీకి అవార్డులు.. హర్షం వ్యక్తం చేసిన ఉప రాష్ట్రపతి
Swachh Survekshan 2020: పరిశుభ్రత విషయంలో ఏపీ దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సాధించింది.
Swachh Survekshan 2020: పరిశుభ్రత విషయంలో ఏపీ దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సాధించింది. గతంలో మాదిరి కాకుండా ఏకంగా 28 నుంచి 6 వరకు ఎగబాకింది... ఈ విధంగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆరు వరకు రాష్ట్రానికి దక్కడం విశేషం. గతంలో ఎన్నడూలేని విధంగా అవార్డులు దక్కడంతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.భవిషత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని టిట్వర్ ద్వారా ఆయన కోరారు.
రాష్ట్రంలోని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోంది. నేరుగా ప్రజల వద్దకే అన్ని సేవలు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో రికార్డు స్థాయిలో ఏపీకి పురస్కారాలు దక్కాయి. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో అత్యధిక పురస్కారాలు ఏపీకి దక్కాయి.
పరిశుభ్రత విషయంలో రాష్ట్ర ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి 28వ ర్యాంక్ నుండి 6వ స్థానానికి చేరుకుంది. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్‌కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి.
భారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను గురువారం ప్రకటించింది. 10 లక్షలకు పైగా జనాభా కలిగి పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల జాబితాలో నాలుగవ స్థానంలో విజయవాడ, ఆరవ స్థానంలో తిరుపతి, తొమ్మిదవ స్థానంలో విశాఖపట్నంలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు నాలుగు, ఆరు, తొమ్మిదవ స్థానాలలో చోటు సంపాధించడం ఆనందదాయకమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.
వెంకయ్య హర్షం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది. విర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు అవార్డులను ప్రకటించారు. దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 28 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2016 సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు.