ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ, పదేపదే టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం, తన స్థానం నుంచి లేచి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యులు చైర్‌ను అవమానిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తాను సభను నడిపించలేనని వ్యాఖ్యానించారు. తనను అసభ్య పదజాలంతో దూషించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
స్పీకర్ చైర్‌ను అగౌరవ పరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు సిగ్గు పడాలని అన్నారు. కీలక చట్టాలను చేస్తున్న సమయంలో విపక్షాలకు ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే, తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, అయినా, తనను అవహేళన చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సిన సభలో ఈ పరిస్థితిని తాను ఊహించలేదని అన్నారు. స్పీకర్ చైర్‌ను వదిలి వెళ్లడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.