పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు
Modakondamma Jatara: ఉత్సవాలకు రూ.కోటి మంజూరు
Modakondamma Jatara: ఉత్తరాంద్రతో పాటు గిరిజన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరొందిన మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన లక్షల సంఖ్యలో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ ఏడాది మోదకొండమ్మతల్లి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసింది.
గత రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి కారణంగా మోదకొండమ్మతల్లి ఉత్సవాలు జరగలేదు. అన్ని వర్గాల భక్తులు ఇంటి పండగలకే పరిమితం చేసుకున్నారు. ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టడం, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. మూడు రోజులపాటు నిర్వహించే మోదమ్మ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కూడా మోదకొండమ్మతల్లి గిరిజన జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
పాడేరు పట్టణం విద్యుత్ దీపాలతో ధగధగలాడుతోంది. మెయిన్ రోడ్దు, కాంప్లెక్సు రోడ్డు, గొందూరు రోడ్డు, సుండ్రుపుట్టు రోడ్లన్నింటిని విద్యుత్ దీపాలు, భారీ సెట్టింగులతో అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. జాతరకు భారీ బందోబస్తు, పటిష్ట భద్రత చర్యలను పోలీసుశాఖ పటిష్టం చేసింది. ప్రత్యేక పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్, ఏఆర్, ఏపీఎస్పీ పోలీసు పార్టీలను కూడా రంగంలోకి దింపింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశారు. భక్తులు ఏ సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాడేరు ఎమ్మెల్యే పాటు అల్లూరి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పడు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.