Arogyasri for Corona: అక్కడ కూడా కరోనాకు ఉచితంగా చికిత్స..ప్రభుత్వమే నిధులు చెల్లింపు
Arogyasri for Corona: కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మద్యకాలంలో నిరోధించే పరిస్థితి కనిపించడం లేదు.
Arogyasri for Corona: కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మద్యకాలంలో నిరోధించే పరిస్థితి కనిపించడం లేదు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వీలైనంత మేర వైద్య సదుపాయాలు కల్పించాలన్నదే ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచనగా కనిపిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం కరోనా సోకితే ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లించేలా నిబంధనలు విధించింది.
కోవిడ్ బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వైద్యానికి అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లోనూ ప్రభుత్వపరంగా కోవిడ్ బాధితులకు చికిత్స అందుతోంది. వైద్యం, మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండటంతో ఇక్కడ కూడా రోగులకు ఉచితంగా సేవలందుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్న వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు నిర్దేశించిన మేరకే ఫీజులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే చికిత్స ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనిపై ప్రభుత్వం జవహర్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
► ప్రభుత్వ ఆధ్వర్యంలో డిసిగ్నేటెడ్ ఆస్పత్రులు అంటే ఉదాహరణకు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రతి కోవిడ్ పేషెంటుకూ ఉచితంగానే వైద్యం అందుతుంది.
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కోవిడ్ సేవలు అందుతాయి.
► ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో బీపీఎల్ కుటుంబాలు, లేదా ఏపీఎల్ (ఎబో పావర్టీ లైన్)లో ఉన్న వారికి ఉచితంగా సేవలు అందిస్తారు. వీరికి వైద్యమందించినందుకు నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
► ఇవిగాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ప్రైవేట్ ఆస్పత్రులకు ఎవరైనా వెళ్లి వైద్యం చేయించుకోవాలనుకుంటే వారికి ప్రభుత్వం చెల్లించదు. వైద్యం పొందిన వారే చెల్లించాలి.
► అలాంటి ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో చేరదలిస్తే ఆయా జిల్లాల కలెక్టర్లు అదేరోజు అనుమతులు మంజూరు చేయవచ్చు
► కోవిడ్ సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు కనీసం 70 పడకల కంటే ఎక్కువ కలిగి ఉండాలి. పేషెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారులకు పంపించాలి.
► రోగులకు శస్త్రచికిత్స, ప్రసవం లాంటి పరిస్థితుల్లో ఆర్టీపీసీఆర్ లేకుండా తక్షణమే వైద్యం చేయాలి. ఆ తర్వాత పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే అధికార వర్గాలకు తెలియజేయాలి.
► ప్రైవేట్ ఆస్పత్రుల నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే.
► ఈ ప్రక్రియ నిర్వహణకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో వెబ్‌పోర్టల్ పనిచేస్తుంది.
'చాలా రాష్ట్రాల్లో కోవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చులను పరిశీలించాకే ఈ ఫీజులు నిర్ణయించాం. తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చికిత్స ఖర్చు చాలా తక్కువని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, డా.మల్లికార్జున పేర్కొన్నారు.
'ప్రభుత్వం నిర్ణయించిన ఆస్పత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లోనూ చికిత్స ఉచితమే. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా జాబితాలో ఉన్న ఆస్పత్రులకు వెళితే ప్రభుత్వమే భరిస్తుందని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.