APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాలు ఏర్పాటు
APPSC Group 2 Exam: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్
APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టినట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సి అధికారులతో జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆదివారం నాడు జరగనున్న గ్రూపు ప్రిలిమినరీ స్ర్కీనింగ్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
పరీక్షల నిరంతర పర్యవేక్షణకు 24 మంది అఖిలభారత సర్వీసుల అధికారులు, 40 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులతో పాటు.. 24 వేల 142 మంది ఇన్విజిలేటర్లు, 8,500 మంది ఇతర సిబ్బందిని నియమించామన్నారు. 3,971 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు.
ప్రశ్నా పత్రాలు,జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఇందు కోసం 14 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నామన్నారు. ఏపీపీఎస్సీ కి చెందిన 51 మంది అధికారులు పరీక్షల నిర్వహణతీరును పర్యవేక్షిస్తారని జవహర్ రెడ్డి వివరించారు. పరీక్షా కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలతో అనుసందానించినట్టు చెప్పారు.