TET Exam: ఇక పై సంవత్సరంలో ఒకసారే "టెట్" ఎగ్జామ్

TET Exam: టెట్ పరీక్షను సంవత్సరంలో ఒకసారి నిర్వహించే విధంగా మార్గదర్శకాలు జారీఅయ్యాయి.

Update: 2021-03-18 06:17 GMT

Teacher Eligibility Test: (ఇమేజ్ ఫైల్)

TET Exam: ఇప్పటివరకు రెండు పర్యాయాలు నిర్వహిస్తున్నఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ బుధవారం టెట్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇకపై కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి కొత్తగా ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు సైతం టెట్‌ ఉంటుంది. వ్యాయామ ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చారు. ఎస్జీటీల(ప్రాథమిక విద్య 1-5 తరగతులు)కు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్ల(6-8 తరగతులు)కు పేపర్‌-2 ఉంటుంది. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు ప్రాథమిక, ఉన్నత విద్యలకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆదేశాలకు అనుగుణంగా 2010కి ముందు డీఈడీ పూర్తి చేసిన వారికి ఇంటర్‌లో 45% మార్కులున్నా పరీక్షకు అనుమతిస్తారు. ఆ తర్వాత సంవత్సరాల వారికి 50% మార్కులు తప్పనిసరి. 2011 జులై 29కి ముందు బీఈడీలో ప్రవేశాలు పొందిన వారికి డిగ్రీలో ఎలాంటి అర్హత మార్కులు అవసరం లేదు. డీఈడీ, బీఈడీ చివరి ఏడాది చదివేవారు టెట్‌కు అర్హులే.

అర్హత మార్కులు ఇలా...

జనరల్‌ అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40% పైన మార్కులను అర్హతగా నిర్ణయించారు. టెట్‌ కాలపరిమితి ఏడేళ్లు వరకు ఉంటుంది. ఉపాధ్యాయ నియామకాల్లో దీనికి 20% వెయిటేజీ ఇస్తారు. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ లో ప్రకటన...

టెట్‌ను జులైలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ లేకుంటే వచ్చే నెలలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంటుంది. అదే విధంగా సిలబస్ ను కూడా మార్చేందుకు విద్యాశాఖ ప్రణాళికను రూపొందిస్తోంది.

Tags:    

Similar News