సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?

Update: 2024-10-16 14:45 GMT

Sajjala Ramakrishna Reddy News: వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం జగన్ జమానాలో అన్నీ తానై నడిపిన అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా! నడుస్తున్న నాటకీయ పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. ఆయన విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 7న ఆయన విదేశాలకు వెళితే 10న లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. తీరా ఆయన విదేశాల నుంచి వచ్చాక ఈనెల 17న గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలంటూ మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే సీఐడికి అప్పగించినప్పటికీ తాజాగా మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులిచ్చారు. సజ్జలను విచారణ చేసే సమయంలో సీఐడి అధికారులు ఉండే అవకాశమున్నట్టు సమాచారం. మరి, సజ్జల విచారణకు వెళతారా.. వెళ్ళరా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ విచారణకు వెళితే సజ్జలను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి.

ఇసుక, మద్యం విధానాలపై వస్తున్న తీవ్ర విమర్శలు, హామీలు అమలు చేయలేకపోవడం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి ప్రభుత్వం నాటకం ఆడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు జారీ చేయటమేంటని సజ్జల కూడా బుధవారం నాడు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకేసులో సుప్రీంకోర్టు తనకు గతనెల సెప్టెంబరు 20న ఇంటెరిం ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తే ఇపుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

సజ్జల మాటలను బట్టి ఆయన దీనిపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. సజ్జల కోర్టును ఆశ్రయిస్తే పోలీసుల వైఖరి ఎలా ఉండబోతుంది.. లేదంటే విచారణకు హాజరయితే పోలీసులు పోలీసులు తీసుకోబోయే చర్యలేమిటన్న విషయం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇంటెరిం ప్రొటెక్షన్ ఉన్న సజ్జలను ఈ కేసులో అరెస్ట్ చేయటం సాధ్యం కాకపోవచ్చనీ, ఒక వేళ అరెస్ట్ వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే పోలీసులు చూపించే కారణాలపై కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

సరిగ్గా మూడేళ్ళ క్రితం 2021 అక్టోబరు 19న టీడీపీ ప్రధాన కార్యాలయంపై కొందరు దాడి చేశారు. చేతిలో కర్రలు, రాడ్లతో పార్టీ కార్యాలయంపై ఫర్నీచర్, కార్లు, అద్దాలు ధ్వంసం చేశారు.. చేసి ఈ దాడి చేసిన కేసులో దేవినేని అవినాష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితర నాయకులతో పాటు సజ్జలను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే సూత్రధారులుగా భావిస్తున్న నేతలతో పాటు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనేకమందిని పోలీసులు విచారించారు. విచారణ ఎదుర్కొన్న వారిలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌లు కూడా ఉన్నారు. ఇపుడు మళ్లీ విచారణకు రావాలంటూ సజ్జలకు నోటీసులు పంపించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్ళి ఇటీవలనే లొంగిపోయారు. శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డికి పానుగంటి చైతన్య ప్రధాన అనుచరునిగా ఉన్నారనీ, వైసీపీలో ప్రధాన నాయకుల ఆదేశాల మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని చెబుతున్నారు. తెలుగుదేశంలో పట్టాభి లాంటి నాయకులు అపుడు సీఎం హోదాలో ఉన్న జగన్‌ను వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషించటంతో ఆయన అభిమానులు ఆవేశంతో దాడి చేశారని చెబుతున్నారు. బుధవారం నాడు ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల కూడా అదే అంటున్నారు..

Tags:    

Similar News