Andhra Pradesh: నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక
Andhra Pradesh: టీడీపీ హయాంలో పెగాసస్ పరికరాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణ
Andhra Pradesh: ఏపీ రాజకీయాలలో కలకలం రేపిన పెగాసస్ వ్యవహారంలో కీలక నివేదిక ఇవాళ ఏపీ అసెంబ్లీ ముందుకు రానుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు నాటి ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ సంస్థకు చెందిన నిఘా పరికరాలను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం... శాసన సభా కమిటీని ఏర్పాటు చేశారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆయా శాఖలకు చెందిన అధికారులను విచారించింది. ఆయా శాఖల వద్ద ఉన్న ఆధారాలను కూడా సేకరించింది. అధికారుల విచారణ, ఆధారాల సేకరణలతో మొత్తంగా 85 పేజీలతో కమిటీ తన నివేదికను రూపొందించింది.
పెగాసస్ కమిటీ మధ్యంతర నివేదికను స్పీకర్‌కు ఇచ్చామని పెగాసస్ హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు హోం, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన ఆధారాలను బట్టి స్పష్టమైందన్నారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా సమాచారం చౌర్యం అయినట్లు తేలిందన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు వంటి మరిన్ని అంశాలు తేల్చాల్సి ఉందని రాజా చెప్పారు. ఈ కమిటీ నివేదిక నేపథ్యంలో నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.