నిమ్మాడలో టీడీపీ గెలుపు.. షాక్ లో వైసీపీ నేతలు!
కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన శ్రీకాకుళం జిల్లా నిమ్మడ గ్రామం ఫలితం వైసీపీకి షాక్ ఇచ్చింది.
అక్కడ ఆయన కన్నీరు కథ మార్చిందో.. అయన కుటుంబానికి ఆ గ్రామంలో ఉన్న పట్టు నిరూపితమైందో తెలియదు కానీ.. గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డిన అధికార పార్టీకి మాత్రం చుక్కలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్.. ఫలితాలు వచ్చేశాయి. కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన శ్రీకాకుళం జిల్లా నిమ్మడ గ్రామం ఫలితం వైసీపీకి షాక్ ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో అన్ని గ్రామాలు ఒక ఎత్తు.. నిమ్మడ గ్రామం ఒక ఎత్తు అన్నట్టు అధికార వైసీపీ ఆ గ్రామ సర్పంచ్ స్థానం కోసం పోరాటం చేసింది. ఆ గ్రామం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు స్వగ్రామం కావడమే దీనికి కారణం. ఎన్నికల హడావుడి మొదలైన దగ్గరనుంచీ వైసీపీ ఈ గ్రామం పై విపరీతమైన ఆసక్తి చూపించింది. నిమ్మడ గ్రామంలో గత 40 ఏళ్లుగా ఎన్నికలే జరగలేదు. అచ్చెన్నాయుడు కుటుంబం బలపరిచిన వారే ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా వైసీపీ నుంచి అభ్యర్ధిని నిలబెట్టి అక్కడ ఎన్నికలు జరిగేలా చూడాలని నిర్ణయించారు. దీనికోసం లక నేతలంతా కేవలం ఆ పంచాయతీపైనే ఫోకస్ చేశారు. ముఖ్యంగా వైసీపీ జిల్లా ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ అక్కడే మకాం వేసి అన్నీ తానై చూశారు. ఇక టీడీపీ కూడా ఈ పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇదిలా ఉంటే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును వైసీపీ బలపర్చిన అభ్యర్థి అప్పన్నను బెదిరించారనే కారణం చూపిస్తూ అరెస్ట్ చేశారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మడలో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. అక్కడ వైసీపీ అభ్యర్థి అప్పన్నపై 1700 ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయం చేసుకున్నారు. వైసీపీ బలపర్చిన అప్పన్నకు కేవలం 157 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో అధికార వైసీపీకి షాక్ తగిలింది.
అయితే, తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ అచ్చెన్నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వ్యాఖ్యానించారు. అదేవిధంగా సంబంధం లేని కేసులో ఇరికించారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం అంటూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఈ గెలుపు అచ్చేన్నయుడి పై సానుభూతితో వచ్చిందంటూ సర్ది చెప్పుకుంటున్నారు. టీడీపీ వర్గీయులు మాత్రం అది తమ బలమే అని చెబుతున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిమ్మడ లో టీడీపీ తమ పట్టును నిలబెట్టుకోవడం వైసీపీ కి మింగుడుపడని విషయమే అని అంటున్నారు.