ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. ఘర్షణలు, కిడ్నాప్‌లు.. ముగిసిన తొలిదశ నామినేషన్ల పర్వం
*చిత్తూరు జిల్లా యాదమర్రిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ *శ్రీకాకుళం జిల్లాలో కొన్నిచోట్ల నామినేషన్ పత్రాల చించివేత *తూ.గో.జిల్లా గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నాప్
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. తొలి విడతలో 168 మండలాల్లోని 3వేల 249 పంచాయతీలు, 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడురోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొదటిరోజు 1,317 పంచాయతీలు, 2,200 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు 7వేల 460 పంచాయతీలు, 23 వేల 318 వార్డులకు నామినేషన్లు రాగా.. ఆఖరిరోజు మాత్రం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరి 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఘర్షణలు, మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నాప్ ఘటనలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లా యాదమర్రి మండల కేంద్రంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. తమ సర్పంచ్ అభ్యర్థిని కారుతో ఢీకొట్టారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుపై వైసీపీ నేతలు దాడికి దిగారు. దొరబాబు కారును ధ్వంసం చేశారు. పేర్నంబట్టు సర్పంచ్ అభ్యర్థి తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు ఎమ్మెల్సీ దొరబాబు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ చెదురుమదురు ఘర్షణలు జరిగాయి. నామినేషన్లు ప్రారంభం నాటి నుంచి కూడా టీడీపీ సానుభూతి పరులను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం, హనుమంతు నాయుడుపేట గ్రామాల్లో నామినేషన్ పత్రాలు చించి వేసిన ఘటనలు వెలుగుచూశాయి. అయితే.. అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం.. పలు విమర్శలకు దారి తీస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతూ కర్రలు, బ్యాట్లు చేతపట్టి వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేయడంతోనే తమ గెలుపు ఖరారైందంటూ ధీమా వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అడ్డాలో వైసీపీ జెండా పాతడమే తమ లక్ష్యమంటూ నినదించారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కిడ్నాప్ ఘటనలు కూడా చోటుచేసుకోవడం కొంతవరకు ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అపహరించుకుపోయారు దుండగులు. నిన్న సాయంత్రం నుంచి శ్రీనివాసరెడ్డి కనిపించకపోవడంతో బంధువులు.. సమీప ప్రాంతాల్లో వెతికారు. అయితే.. గోవిందపురం అటవీప్రాంతంలో శ్రీనివాసరెడ్డిని పశువుల కాపరులు గుర్తించారు. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, ఓ చోట పడేసి ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు పశువుల కాపరులు. వైసీపీ నేతలే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తోంది బాధితుడి భార్య.
అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లిలో సర్పంచ్ అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్నను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక ప్రాంతమైన అడవి మారంపల్లిలోని ఓ ఆలయానికి వెళ్తుండగా ఈరన్నను కారులో వచ్చి ఎత్తుకెళ్లారు దుండగులు. అనంతరం మత్తుమందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి చితకబాదారు. మత్తులో నుంచి కోలుకున్నాక.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కత్తులతో బెదిరించినట్టు బాధితుడు తెలిపాడు. కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఈరన్న.. పోలీసులను ఆశ్రయించాడు.
కిడ్నాప్‌నకు గురైన ఈరన్నను మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో బాధితుడిని పరామర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని తెలిపారు. టీడీపీ అండగా ఉంటుందని బాధితుడికి హామీ ఇచ్చారు చంద్రబాబు.