ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు

Update: 2020-05-22 11:17 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తేసింది. ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయ‌న అక్రమాలకు పాల్పడినట్లు అప్ప‌ట్లో అభియోగాలు న‌మోద‌య్యాయి. డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ మేర‌కు స‌స్పెండ్ చేసిన‌ట్టు అప్పుడు ఏపీ ప్రభుత్వం వెల్ల‌డించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లగా, అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది.


Tags:    

Similar News