ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించగా కొవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే.
గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఇప్పట్లో వద్దని సీఎం జగన్ చెప్పడం జరిగి తీరాల్సిందే అన్నట్లుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా ఇద్దరూ పంథాలకు పోయారు. ఈ వ్యవహారం చివరికి కోర్టు దాకా వెళ్లడంతో ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.
గురవారం నాడు స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. కాగా ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది.