Andhra Pradesh: జనసేన శ్రమదానానికి నో చెప్పిన ఇరిగేషన్ ఎస్‌ఈ
Andhra Pradesh: వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు ఎందరో రాజకీయ నేతల..
Andhra Pradesh: వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు ఎందరో రాజకీయ నేతల పాదయాత్రలకు, రాజకీయ కార్యక్రమాలకు సజీవ సాక్ష్యం ఆ వంతెన.! అలాంటి వంతెన కష్టకాలంలో ఉందా.? రోడ్ల మరమ్మత్తుల కోసం జనసేనాని చేస్తున్న ఉద్యమానికి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు.? అసలు కాటన్ బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? రాజకీయంగా పవన్‌ను అడ్డుకోవడమేనా లేక కాటన్ బ్యారేజ్ వంతెన నిజంగానే ప్రమాదంలో ఉందా.? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు.
మరో రెండ్రోజుల్లో జనసేనాని పర్యటన ఉందనగా అధికారులు షాకిచ్చారు. రోడ్ల మరమ్మత్తుల కోసం వైసీపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించిన జనసేనాని అనంత, తూర్పుగోదావరి జిల్లాల్లో రోడ్లకు శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కొత్తచెరువు దగ్గర జనసేన ఎంచుకున్న రోడ్డు మరమ్మత్తును ప్రభుత్వం హుటాహుటిన పూర్తి చేసేసింది. ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర చూస్తే అధికారులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే, అధికారులు చెప్పిన కారణాలే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాటన్ బ్యారేజ్ వంతెన ప్రస్తుతం దీన స్థితిలో ఉందన్నది అధికారుల వాదన. దీనికితోడు కాటన్ బ్యారేజ్ రోడ్ ఆర్&బీ పరిథిలోకి రాదని, అందుకే ఇక్కడ జనసేన శ్రమదానానికి అనుమతి ఇచ్చేదిలేదని ఇరిగేషన్ ఎస్‌ఈ తేల్చి చెబుతున్నారు. వంతెన పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న అధికారులు కేవలం మానవతా దృక్పధంతోనే ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని చెబుతున్నారు. సరైనా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడిస్తే బ్యారేజీకే నష్టం కలుగుతుందని తేల్చి చెబుతున్నారు.
మరోవైపు అధికారులు నో చెప్పినా జనసేన మాత్రం బ్యారేజ్ వంతెనపై శ్రమదానం చేసి తీరుతామని తేల్చి చెబుతోంది. ప్రభుత్వం కావాలనే ఇలా అడ్డంకులు సృష్టిస్తోందన్న ఆరోపణలూ చేస్తున్నారు. ఇక ఎల్లుండి అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిపితీరుతాం అంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేనాని పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ సైతం తేల్చి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాటన్ బ్యారేజ్ వంతెనపై అక్టోబర్ 2న ఏం జరగనుందనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.