AP Govt postpones house sites distribution to ఆగష్టు : ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అన్ని జిల్లాల్లో ఒకేసారి 30 లక్షల మందికి పైగా పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకే సారి గుంపుగా చేరే అవకాశం ఉంది. దీంతో కరోనా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉన్న కారణంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఆగష్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.
కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం 998 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 18,697కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 232 మంది మృతి చెందారు. ఇందులో 10,043 యాక్టివ్ కేసులు ఉండగా, ఇక 8,422 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.