రాష్ట్రంలో సహజ వాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నులశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తోంది. ముడి చమురు పై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.
కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజ వాయువుపై అదనంగా 10 శాతం మేరకు వ్యాట్ పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్ నెలకు రూ. 4480 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ. 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని రైతు భరోసా, నాడు- నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మ ఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.