షికారుకు రెడీ.. 20నెలల తర్వాత పాపికొండలు బోటు షికారు గ్రీన్ సిగ్నల్
Papikondalu Tourism:దాదాపు 20నెలల క్రితం జరిగిన ప్రమాదంతో నిలిచిన బోట్లు.. మళ్లీ గోదావరిలో పర్యాటకులతో విహరించనున్నాయి.
Papikondalu Tourism: సుదీర్ఘ విరామం తర్వాత పాపికొండల టూరిజం ప్రారంభంకానుంది. దాదాపు 20నెలల క్రితం జరిగిన ప్రమాదంతో నిలిచిన బోట్లు.. మళ్లీ గోదావరిలో పర్యాటకులతో విహరించనున్నాయి. ఇక గతంలో జరిగిన తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తోంది.
గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జలవనరులశాఖ, రెవెన్యూతోపాటు పోలీసు, అటవీశాఖ అధికారుల సమక్షంలో ఈనెల 15న ట్రయిల్ రన్ జరిగింది. ఇక తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని భద్రాచలం కలుపుకుని సుమారు 70వరకు పర్యాటక బోట్లు ఉండగా.. ప్రస్తుతానికి మాత్రం పరిమితి సంఖ్యలో బోట్లకు అనుమతులిచ్చారు. అటు యాభై శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతులు జారీ అయ్యాయి.
చెప్పాలంటే.., 2019 సెప్టెంబర్ 15న దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన ఘోర ప్రమాదంతో పాపికొండల విహారయాత్రను ఆపేశారు అధికారులు. ఇటీవల తూర్పు మన్యంలో టాలీవుడ్ హీరోల సినిమా షూటింగ్ జరగడంతో పర్యాటక బోట్లకు కూడా అనుమతి లభించింది. అయితే ఈసారి మాత్రం బోట్ల ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసిన అధికారులు.. బోట్లపై భాగాన ఇనుప కుర్చీలు వేసిన వాటికే అనుమతులు ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గతంలో పెద్దలకు బోట్లలో ప్రయాణించేందుకుగాను 700 రూపాయలు ఉండగా.., ఇప్పుడు వెయ్యి రూపాయలు చేశారు. అదేవిధంగా చిన్నవారికి 400 రూపాయల టికెట్‌ను 700 రూపాయలకు పెంచారు. అయితే అనుమతులు ఇచ్చిన పర్యాటక బోట్ల పోర్లను జలవనరుల శాఖ అధికారులు క్షణంగా పరిశీలిస్తున్నారు. రెండు ఇంజన్లు పనిచేస్తున్నాయో లేదో చూస్తున్నారు. లైఫ్ జాకెట్లు పూర్తి స్థాయిలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడం ఆనందంగానే ఉన్నా... ప్రస్తుతం కోవిడ్ సమయంలో పర్యాటక బోట్లకు అనుమతులు ఇవ్వడం సరికాదనే వాదన వినిపిస్తోంది. తూర్పుగోదావరిలో అత్యధికంగా కేసులు నమోదవుతుండగా.. టూరిస్ట్‌లకు వైరస్ సోకే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.