ఏపీలో మళ్లీ మొదలైన స్థానిక ఎన్నికల రగడ

Update: 2020-10-24 02:35 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రగడ మళ్లీ మొదలైంది. ఎలక్షన్స్‌కు ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఐతే కరోనా కలకలం రేపుతున్న సమయంలో ఎన్నికలు సాధ్యం కాదని సర్కార్ అంటోంది. అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే విషయం వినిపించాలని సిద్ధం అవుతోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎలక్షన్ నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం మొదలైంది. కోవిడ్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నా ప్రభుత్వం సహకరించడం లేదంటున్నారు నిమ్మగడ్డ. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఎలక్షన్స్ నిర్వహించే ఆలోచన లేదంటోంది. ఈనెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలవారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధమయింది ఈసీ. ఐతే ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఈ విషయంపై నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. ఐతే ఎన్నికల నిర్వహణకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో దానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఈసీ. ఐతే అటు ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలకు సిద్ధంగా లేదు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఎలక్షన్ నిర్వహించే వీలు లేదని ప్రభుత్వం చెప్తోంది. కోవిడ్ నియంత్రణ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంటుందని సర్కార్ అంటోంది.

నవంబర్, డిసెంబర్‌లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్సుందని నిపుణులు చెప్తున్నారని ఇలాంటి సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. బిహార్ ఎన్నికలు కచ్చితంగా జరగాల్సినవి కాబట్టే నిర్వహిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీతో స్థానిక సంస్థల అసెంబ్లీ ఎన్నికలను పోల్చకూడదని స్పష్టం చేశారు. ఓవైపు వర్షాలు, వరద సహాయ చర్యల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బంది బిజీగా ఉన్నారు. చాలామంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీనికితోడు చలికాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది. ఇదే విషయాలను ఆల్ పార్టీ మీటింగ్‌లోనూ వినిపించాలని నిర్ణయించింది. 

Tags:    

Similar News