ఏపీ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏమంటున్నారు?
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా అందుకు ఎంచుకున్న మార్గంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల సామర్థ్యమెంత...? వారికి శిక్షణ ఇచ్చినా ఓ తరం విద్యార్థులు నష్టపోవడం తప్పదా...?
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పని సరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2021 -22 విద్యాసంవత్సరం నుంచి 9 వ తరగతికి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మరుసటి సంవత్సరం నుంచి 10 వ తరగతికి కూడా అన్ని సబ్జెక్టులను ఇంగ్లీషులోనే చెప్పాలి. తెలుగు, ఉర్దూ ఇక భాషా సబ్జెక్టులుగా మాత్రమే ఉంటాయి. ఇక రాష్ట్రంలో విద్యాబోధన అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. జిల్లాల్లో ఉన్న డైట్ కేంద్రాలు ఇకపై ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు అవుతాయి.
S.C.E.R.T ఆంగ్లబోధనపై కసరత్తు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 43 వేల దాకా ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలోని 7 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1 నుంచి 8 వ తరగతి వరకు మొత్తం మీద 8,500 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమల్లో ఉంది. ఇప్పుడు సుమారు మరో 35 వేల పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో బోధన జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మారుతాయి.
ఇప్పుడు సమస్య అంతా ఇంగ్లీష్ మీడియంలో బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంపై ఉంది. తెలుగు మీడియంలో బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సుమారు 96 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంచనా వేసింది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్న వారికి శిక్షణ అవసరం ఉండదు. తెలుగు మీడియంలోనే చదువుకుని, తెలుగు మీడియంలోనే బోధిస్తున్న వారికి మాత్రం శిక్షణ తప్పనిసరి. ఇందుకోసం విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. కొద్ది రోజుల శిక్షణతోనే వీరంతా ఇంగ్లీషు మీడియంలో బోధించే సామర్థ్యాన్ని పొందడం కష్టం. పైగా వారు శిక్షణ పొందే సమయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇతర ఉపాధ్యాయులకు కష్టమవుతుంది. అంటే ఒకటి, రెండు తరాల విద్యార్థులు నష్టపోకతప్పదు. అంతకు మించిన నష్టాలు మరెన్నో ఉన్నాయని ఉపాధ్యాయులు, తెలుగు భాషాభిమానులు అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది తెలుగు మీడియం లో చదువుకుని తెలుగు మీడియంలో బోధిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడంలో వీరు సరైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రమాణాలు పడిపోయి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని కోరుకోవడం సహజం. కాకపోతే విద్యార్థులు ఎంత వరకు సన్నద్ధంగా ఉన్నారో చూడాలి. పిల్లల సామర్థ్యాన్ని, ఇష్టాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపవుట్స్ రేటు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బాలికలు ఎక్కువగా చదువు మానేసే అవకాశం ఉంది.
ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టడంతో మంచి జరుగుతుందా...? ఇంగ్లీషు సరిగా చదవలేకపోతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? మొత్తం సబ్జెక్టులు ఇంగ్లీషు బోధనలో జరిగితే విద్యా ప్రమాణాలు దిగజారుతాయా...? ఆంగ్ల బోధనపై ప్రభుత్వం సామాజికవేత్తలు, భాషా పండితుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుందా...?
విద్యా కమిషన్లు అన్నీ ప్రాథమిక స్థాయి వరకు విద్యాబోధన మాతృభాషలోనే జరగాలన్నాయి. నూతన విద్యావిధానం ముసాయిదాలో కూడా 8 వ తరగతి దాకా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్ కమిటీ 5వ తరగతి దాకా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది. ఇక గిరిజనుల విషయానికి వస్తే గిరిజన భాషల్లో కనీసం ప్రాథమిక స్థాయి వరకు బోధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే తెలుగు, ఇంగ్లీషు బోధించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ మాతృభాషలో బోధిస్తున్నపుడే విద్యాప్రమాణాలు సరిగా ఉండడం లేదు. ఇక ఇంగ్లీషులో బోధిస్తే ప్రమాణాలు మరింత దిగజారుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
2017లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం 6,7, 8 తరగతుల్లో 15 శాతం మంది విద్యార్థులే ఇంగ్లీషు సరిగా చదవగలుగుతున్నారు. 85 శాతం మంది ఇంగ్లీషు సరిగా చదవలేకపోతున్నారు. మరి అలాంటి పిల్లలకు ఇంగ్లీషులో బోధిస్తే వారికి అర్థమవుతుందా ? ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇద్దరు, ముగ్గురు టీచర్లే ఉన్న పాఠశాలలు ఓ 20 వేల వరకూ ఉన్నాయి. అలాంటి చోట ఇంగ్లీషులో అన్ని సబ్జెక్టులు బోధించడం కష్టంగానే ఉంటుంది. విద్యార్థులు చదువులో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించే వారూ ఉన్నారు.
ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అనేది సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది. ఇప్పటి వరకూ ఇంగ్లీషు మీడియం అనేది పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయంతో అది పేదలకు అందే అవకాశం ఏర్పడింది. అందుకే కొంతమంది సామాజికవేత్తలు ఇంగ్లీషు మీడియంలోనే బోధన ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు భాషాభిమానులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగు మాతృభాషగా ఉన్న రాష్ట్రంలో తెలుగులోనే విద్యాబోధన జరుగకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మాతృభాషకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో తెలుగులో అర్హత సాధించడాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పని సరి చేసింది. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భాషాభిమానులు కోరుతున్నారు. భాష అంటే సాహిత్యం లాంటి వాటికే పరిమితం కాదని, శాస్త్ర సాంకేతిక రంగాలకూ అది వర్తిస్తుందనే వాళ్ళూ ఉన్నారు. ఇకపై తెలుగు ఒక భాషగా ఒక సబ్జెక్టుగా విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులన్నీ ఇంగ్లీషులో బోధిస్తారు. ఇది భాషాభిమానులకు ఇబ్బంది కలిగించే అంశమే అయినప్పటికీ మారుతున్న ప్రపంచంతో మారిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. భాషపై అభిమానంతో ఉన్నత అవకాశాలను దూరం చేసుకోలేమనే వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వ ఆశయం మంచిదే కావచ్చు. కాకపోతే అందుకు ఉపాధ్యాయులను, విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకూ తెలుగు మీడియం పాఠశాలలనూ కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంతేగాకుండా ఇంగ్లీష్ మీడియంను దశలవారీగా ప్రవేశపెడితే ఉపాధ్యాయులకు దశల వారీగా శిక్షణ ఇస్తుంటే విద్యార్థులకు చదువు చెప్పడంలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులపై సర్వే నిర్వహించి ఎంతమంది ఇంగ్లీషు మీడియం కోరుకుంటున్నారో కూడా చూడాలి. మరోవైపున ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియంలో చదవడం తప్పనిసరిగా మారింది. కాలేజీ స్థాయిలో ఇంగ్లీషు మీడియం తీసుకున్న వారికంటే కూడా మొదటి నుంచీ ఇంగ్లీషు మీడియంలోనే చదివిన వారు మరింతగా రాణిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే. ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. సలహాలు, సూచనలు ఆహ్వానించాలి. అప్పుడు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలి.