గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త
ఏపీలో గ్రామీణ ప్రాంతప్రజలకు జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది..
ఏపీలో గ్రామీణ ప్రాంతప్రజలకు జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.. రాష్ట్రవ్యాప్తంగా కుళాయిల ఏర్పాటుకోసం జలవనరుల శాఖ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందుకోసం మొత్తం రూ. 4,800.59 కోట్లను విడుదల చేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల నీరు అవసరం. అయితే చాలా మంది ఊళ్లలో ఉండే బోర్లు, ట్యాంకుల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. దానివలన వారికి సమయం వృధా అవుతోంది. అంతేకాకుండా ఎండాకాలం అయితే నీటి సమస్య మరింత తీవ్రం అవుతోంది. దాంతో జలజీవన మిషన్ పేరుతో గత 20 ఏళ్లుగా కుళాయిలు ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
కాగా ఈ జలజీవన మిషన్ పథకంలో భాగంగా 50% నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది. ఇక ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 ఇళ్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే 33,88,160 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.. మిగిలిన 57,52,445 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకోసం మొత్తం రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో 32 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ల ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.4,800.59 కోట్లకు అధికారులు పంపించిన ప్రతిపాదనలకు రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. రెండో దశలో మిగిలిన 25.52 లక్షల ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేయనున్నారు.