కరోనా పోరుపై పాట... రాగం కలిపిన సెలబ్రిటీలు
ఇప్పటివరకు అన్ని రకాలుగా కరోనా పోరులో ముందున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
ఇప్పటివరకు అన్ని రకాలుగా కరోనా పోరులో ముందున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో గీతాన్ని రూపొందించింది. అయితే దీనిలో ప్రత్యేకంగా సినీనటులు నిఖిల్, కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్తో పాటు తమ రాగం కలిపారు. దీనిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యం వహించారు.
కరోనాపై ప్రపంచ దేశాలన్నీ అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. భారత్‌లో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచారు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. వారి కోసం ఏపీ ప్రభుత్వం ఓ పాటను రూపొందించి, అంకితం చేసింది. అందులో చైనా నుంచి వైరస్ రావడం, ప్రపంచమంతా విస్తరించడం, లాక్‌డౌన్ ప్రకటించడం ఇలా పలు విషయాలను చూపించారు. అలాగే కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఘటన, వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి కూడా వీడియోలో చూపారు.
ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఇక పాటలో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు క్రీడా ప్రముఖులు భాగమయ్యారు. అందులో కాజల్ అగర్వాల్, నిఖిల్, ప్రణీతా సుభాష్, పీవీ సింధు, ద్రోణవల్లి హారిక, పాయల్ రాజ్‌పుత్, సుధీర్ బాబు, నిధి అగర్వాల్ ఉన్నారు. "సమరం సమరం.. విధితో సమరం" అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.