AP Government Changed Quarantine Rules: క్వారంటైన్ విధానంలో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం!
AP Government Changed Quarantine Rules: ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారికి క్వారంటైన్ విధానంలో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు ఈ మార్పులు చేసింది..
AP Government Changed Quarantine Rules:ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారికి క్వారంటైన్ విధానంలో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు ఈ మార్పులు చేసింది.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు 14 రోజులకి బదులుగా ఏడు రోజులు తప్పకుండా క్వారంటైన్ లో ఉండాలని పేర్కొంది. అటు గల్ఫ్ నుంచి వచ్చిన వారు 14 రోజులకి బదులుగా క్వారంటైన్ ఏడు రోజులకి కుదింపు చేసింది.
ఇక రైళ్ల ద్వారా వచ్చే వారు ర్యాండమ్‌గా టెస్టులు చేసుకోవాలని, 14 రోజుల హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది. అటు రహదారుల గుండా వచ్చేవారికి స్పందన పాసులు ఉంటేనే అనుమతించనున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు చేసి కొవిడ్ ఆస్పత్రులకు తరలించాలని నిబంధనలో పేర్కొంది. హోం క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని పేర్కొంది. ఇక అటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా పేర్కొంది.
ఇక అటు ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1919 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ని పరీక్షించగా 1919 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. ఇక 1030 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 28,255. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,275కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 13,615 మంది చికిత్స పొందుతున్నారు.