Pawan Kalyan: ఆ మొక్కలు నాటకండి.. పవన్ కళ్యాణ్ పిలుపు
అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాయని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలను అక్కడ విరివిగా పెంచారు.
ఆంధ్రప్రదేశ్‌లో 'మన మహోత్సవం' పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ఈ నేపపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. మొక్కలు నాటే విషయంలో ఓ తప్పు చేయొద్దంటూ పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగానే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు. అయితే అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి మేలు చేస్తాయని ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు. కోనో కార్సస్ మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో నాటకూడదని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.
అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాయని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలను అక్కడ విరివిగా పెంచారు. అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయని తెలిపారు. ఈ మొక్కల వల్ల పలురకాల అనర్థాలు తప్పవని పవన్ తెలిపారు. ఇవి భూగర్భ జలసంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతాయని పవన్ చెప్పుకొచ్చారు.
ఈ జాతికి చెందిన మొక్కలను పశువులు కూడా తినవని, పక్షులు సైతం గూడుపెట్టుకోవని.. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచుకోవడం సరికాదంటూ పవన్ పిలుపునిచ్చారు. ఈ మొక్కలను నాటడం మానేయాలని తెలిపిన పవన్.. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు కోనోకార్పస్‌పై నిషేధం విధించాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.