Nadu Nedu: రాష్ట్రంలో ఒక స్కూలు కూడా మూత పడకూడదు- సీఎం జగన్
Nadu Nedu: ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన ‘నాడు-నేడు' కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
Nadu Nedu: ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన 'నాడు-నేడు' కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు. ప్రతి స్కూలు కూడా వినియోగంలో ఉండాలి..శిక్షితుడైన టీచర్ పీపీ–1, పీపీ–2 పిల్లలకూ అందుబాటులో ఉండడం మంచిదే. ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పనితీరు సాధించుకోగలం. అసహనం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదు. మనం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి. మంచి పనితీరు రాబట్టుకోండి, స్కూళ్ళ నిర్వహణ, టీచర్లని వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి.
పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి..పిల్లలకు 2 కి.మీ. దూరం లోపలే బడి ఉండాలి..ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుంది. నాడు– నేడు కింద అన్నిరకాల స్కూళ్లు, అంగన్‌వాడీలను అభివృద్ధిచేస్తున్నాం. అవసరమైన చోట అదనపు తరగతి గదులను నాడు–నేడు కింద నిర్మించాలి. అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోవాలి. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలి. నాడు – నేడు కింద బాగుచేసిన భవనాల నిర్వహణపై దృష్టిపెట్టాలి. ఏం సమయానికి ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఓపీ తయారు చేయండి. వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాల్సి ఉంది అని సీఎం జగన్ ఆదేశించారు.