AP CM Jagan meeting On Floods: అందరూ అప్రమత్తంగా ఉండాలి.. ఏపీ సీఎం ఆదేశం
AP CM Jagan meeting On Floods: వరదల నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు. ఇప్పటికే వరదల వల్ల పలు సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
AP CM Jagan meeting On Floods: వరదల నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు. ఇప్పటికే వరదల వల్ల పలు సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలు మరలా చోటుచేసుకుండా చూడాలని హితవు పలికారు, గోదావరి మరలా పెరుగుతోందని, దానికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కృష్ణానదిలోకి భారీగా వరద జలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆయన స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించాలన్నారు. (వైద్యం.. మరింత చేరువ)
ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆహారం, మందులు, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న గోదావరి
గోదారమ్మ తగ్గినట్లే తగ్గి అంతలోనే మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు వరద ఉద్ధృతి పెరగడంతో భద్రాచలం వద్ద మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 55.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.75 అడుగుల నీటిమట్టం ఉండగా మొత్తం 175 గేట్లను ఎత్తి 18,59,570 క్యూసెక్యులను సముద్రంలోకి వదులుతున్నారు.
► భద్రాచలం వద్ద వరద తాకిడి మరోసారి పెరగడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు తిరిగి జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద నీరు రహదారిపైకి చేరడంతో కుక్కునూరు – భద్రాచలం రాకపోకలు నిలిచిపోయాయి.
► ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.
► రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ధనలక్ష్మి పరిశీలించారు.
► శబరి వరద నీరు చింతూరులో ప్రవేశించి సుమారు 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసర సరుకులను అందచేస్తున్నారు. చింతూరు వంతెన వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైన లాంచీ సరంగు పెంటయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.