AP CM Jagan expresses condolence: ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు మృతికి సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని 'పామును పొడిచిన చీమలున్నా'యంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారు. వంగపండు మృతిపట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు ప్రసాదరావు ఇవాళ తెల్లవారుజామున పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాసను విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించడమే కాకుండా వాటికి గజ్జెకట్టి ఆడి పాడారు. పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని ఎలుగెత్తి.. గొంతెత్తారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జానపద కళాకారులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.